Hills And Mountains Kabja: కొండలైనా.. గుట్టలైనా కరిగిపోవాల్సిందే.. కబ్జా కోరల్లో కడప జిల్లా - ap latest news
Hills And Mountains Kabja in Ysr District: రాష్ట్రంలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. కబ్జాదారులు దేన్నీ వదలడం లేదు. కొండలు, గుట్టలు, చెరువులు, ఆలయ భూములు, పేదల స్థలాలు.. ఏవైనా తగ్గేదేలే అన్నట్లు కబ్జా చేస్తున్నారు. మా కన్ను పడిందా.. అది కబ్జా అయినట్లే అంటున్నారు. ఇన్ని చోట్ల కబ్జాలు, ఆక్రమణలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపు చూడనే చూడటం లేదు. దీంతో అక్రమార్కులు ఇంకా రెచ్చిపోతున్నారు. తాజాగా వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ పురపాలకలో కబ్జాదారులు కొండలను సైతం వదలడం లేదు. బద్వేల్‌కు పురపాలక హోదా కలగడంతో చుట్టూ ఉన్న కొండలపై ఉన్న మట్టిని, రాళ్లను యంత్రాలతో తవ్వి ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. కొండ గుట్టలను చదును చేసి సమాంతరంగా మారుస్తున్నారు. దీనిపై స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాత్రికి రాత్రే షెడ్లను అక్రమంగా నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుందని.. దీనిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.