మచిలీపట్నంలో టీడీపీ, జనసేన శ్రేణుల అరెస్టు - ఉద్రిక్త వాతావరణం - ఎమ్మెల్యే పేర్ని నాని
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 6:52 PM IST
High Tension at Machilipatnam: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 'రాజాగారి సెంటర్'లో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ, జనసేన నేతలు తొలగించడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. మచిలీపట్నం ప్రధాన కూడలి 'రాజాగారి సెంటర్'ను గత మూడేళ్లగా పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. వ్యాపార కూడలైన 'రాజాగారి సెంటర్'లో ఉన్న కొంత మంది వ్యాపారస్థులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని(YSRCP MLA Perni Nani)ఈ చర్యలకు పాల్పడ్డారని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి.
TDP-Jansena Leaders Arrest in Krishna District: దీనిపై అనేకసార్లు వ్యాపార సంస్థల ప్రతినిధులతో పాటు టీడీపీ, జనసేన నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం సహా జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని టీడీపీ, జనసేన శ్రేణులు ఈ రోజు నిరసన చేపట్టారు. నిరనసకారులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.