ఆంధ్రప్రదేశ్

andhra pradesh

government_talks_with_anganwadi

ETV Bharat / videos

అంగన్‌వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు విఫలం - రేపట్నుంచి ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ధర్నాలకు పిలుపు - Andhra Pradesh Anganwadi Groups news

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 9:31 PM IST

Updated : Dec 26, 2023, 10:06 PM IST

Government Talks with Anganwadi Groups Failed: అంగన్‌వాడీలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పటికే తమ సంఘాలతో 4సార్లు చర్చలు జరిపారన్న అంగన్‌వాడీల ప్రతినిధులు ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రేపటి నుంచి ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ధర్నాలు చేస్తామని వారు ప్రకటించారు. ఇప్పటివరకు తమ డిమాండ్లను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లలేదని తమకు తెలిసిందని అంగన్‌వాడీలు వాపోయారు. 15 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలను రోడ్లపై నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ వేతనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తమ చేత వెట్టిచాకిరీ చేయించుకుందని ఆవేదన చెందారు. అన్నింటికీ అప్పులు తెస్తున్నామని ప్రభుత్వ ప్రతినిధులు అంటున్నారని, సీఎం జగన్‌ చొరవ తీసుకుని తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Anganwadi Associations Dharna Updates: వేతనాల పెంపు, గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు (టీచర్లు), ఆయాలు (హెల్పర్లు) డిసెంబర్‌ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దాదాపు 15 రోజులుగా వారు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ జవహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు చర్చలు జరిపారు. ''ప్రభుత్వం ఒకవైపు బుజ్జగిస్తూనే మరోవైపు బెదిరిస్తోంది. మా సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లకపోవడం ఏంటి?  వీళ్లు మంత్రులుగా ఉన్నారా? లేదా? అనే అనుమానం వస్తోంది? సంక్రాంతి వరకు పనిచేస్తే పరిష్కరిస్తామని అంటున్నారు? 15 రోజుల్లో ప్రభుత్వానికి బంగారు గనులు ఏమైనా వస్తాయా? మా జీతాలు పెంచేందుకు ప్రభుత్వం వద్ద డబ్బు లేదా? అనేక ఏళ్లుగా మానసిక వేదనకు గురవుతున్నాం. కొంతమంది ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నారు'' అని అంగన్‌వాడీల ప్రతినిధులు ఆవేదన చెందారు. 

''మాది మహిళా పక్షపాత ప్రభుత్వం. వేతనాల పెంపునకు కొంత సమయం కావాలని చెప్పాం. పండగ తర్వాత మరోసారి చర్చిద్దామని సూచించాం. మా విజ్ఞప్తుల పట్ల అంగన్వాడీలు సానుకూలంగా ఉన్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల సమయం కోరుతున్నామనేది సరికాదు''- బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి

Last Updated : Dec 26, 2023, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details