బాణసంచా నిప్పురవ్వలు పడి దగ్ధమైన ఇళ్లు - ఎమ్మెల్యే ఫ్లెక్సీ వల్ల ఘటన స్థలికి వెళ్లలేకపోయిన ఫైర్ ఇంజిన్! - దీపావళి రోజున బాపట్లలో అగ్ని ప్రమాదం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 12, 2023, 10:28 PM IST
Fire Accident in Bapatla Due to Diwali Crackers: దీపావళి పండుగ వేళ బాపట్ల పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. రెండు చోట్ల అగ్నిప్రమాదం జరిగింది. పండుగ వేడుకల్లో భాగంగా కాల్చిన బాణసంచా నిప్పురవ్వలు పడి ఎస్.ఎన్.పి అగ్రహారం, గులాం హుస్సేన్ తోటలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్.ఎన్.పి అగ్రహారంలోని ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ వెళ్లేందుకు ఆలస్యం కావడంతో.. రెండు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఎమ్మెల్యే ఫ్లెక్సీ రహదారిపై అడ్డుగా ఉండటంతో.. ఫైర్ ఇంజిన్ వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
కొన్ని రోజుల క్రితం.. శివాలయం కార్యక్రమానికి ఎమ్మెల్యే వస్తున్న నేపథ్యంలో ఫ్లెక్సీలు కట్టారు. కార్యక్రమం జరిగి అనేక రోజులు గడిచినా.. అధికారులు ఫ్లెక్సీలు తీయకుండా అలాగే ఉంచారు. దీంతో ఈ రోజు ఫైర్ ఇంజిన్‌కు ఫ్లెక్సీ అడ్డుగా ఉండటంతో.. సిబ్బంది ఫ్లెక్సీ తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఫ్లెక్సీకి కరెంటు షాక్ రావడంతో.. తొలగించేందుకు చాలా సమయం పట్టింది. దీంతో స్థానికులే పైపులతో నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు మంటలు అదుపు చేసినప్పటికీ.. అప్పటికే ఇంట్లోని సామగ్రి మెుత్తం మంటల్లో కాలిపోయిందని, కట్టుబట్టలతో మిగిలామని బాధితులు వాపోతున్నారు.