R5 Zone: రాజధాని ప్రాంతంలోని ఆర్5 జోన్లో జేసీబీలు.. అడ్డుకున్న రైతులు - amaravati latest news
Jungle Clearance Works in R5 Zone: రాజధాని ప్రాంతంలోని ఆర్ - 5 జోన్లో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులను రైతుల అడ్డుకున్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాలలోని పేదలకు రాజధానిలో సెంటు భూమి ఇచ్చేందుకు R5 జోన్లో జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు సీఆర్డీఏ అధికారులు రంగంలోకి దిగారు. ఈ సమాచారం అందుకున్న రైతులు హుటాహుటిన కృష్ణాయపాలెం చేరుకున్నారు. జంగిల్ క్లియరెన్స్ చేస్తున్న జేసీబీలను, అధికారులను.. రైతులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి జేసీబీలను వెనక్కి పంపించారు.
ఆర్ - 5 జోన్ అనే అంశం హైకోర్టులో ఉండగా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని రైతులు ఆరోపించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. అవినాష్ రెడ్డి వ్యవహారంపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని రైతులు చెప్పారు. ఎక్కడో ఉన్న పేదలను ఇక్కడకి తీసుకొచ్చి.. ఇక్కడ ఉన్న వారితో గొడవలు పెట్టే ప్రయత్నం జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన వారి భూములను మంచిగా చేయకుండా ఎక్కడో ఉన్న వారి కోసం ఎలా చేస్తారని రైతులు ప్రశ్నించారు. ఇది ఒప్పంద ఉల్లంఘన అని అన్నారు.