Teachers Unions Protest: బదిలీల తర్వాతే ఉద్యోగోన్నతులు చేపట్టాలి.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్న ఫ్యాప్టో
FAPTO AGITATION IN FRONT OF GUNTUR DEO OFFICE : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నిరసన కార్యక్రమం చేపట్టింది. ఫెడరేషన్ ఆఫ్ ఏపీ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో గుంటూరులో డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం చేపడుతున్న ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతుల తీరును వారు నిరసించారు. ఉద్యోగోన్నతులను మాన్యువల్ విధానం ద్వారా నిర్వహించాలని, బదిలీల్లో ఉన్న అసంబద్ధతలను తొలగించాలని డిమాండ్ చేశారు. బదిలీలు, ఉద్యోగోన్నతుల కోసం జారీ చేస్తున్న ఉత్తర్వులు గందరగోళంగా ఉంటున్నాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపించారు.
1800 మందిని ఉద్యోగోన్నతుల కోసం పిలిస్తే, కేవలం 500 మంది ఉపాధ్యాయలు మాత్రమే ఉద్యోగోన్నతులు తీసుకోవడానికి ముందుకు వచ్చారని వారు గుర్తు చేశారు. ప్రాంతం ఎక్కడనేది చూపకుండా ఉద్యోగోన్నతులు ఎలా చేపడతారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బదిలీల తర్వాతే ఉద్యోగోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఫ్యాప్టో నేతలు ఈ సందర్భంగా హెచ్చరించారు.