Pet Dog cremation పెంపుడు కుక్క మృతితో అల్లాడిపోయిన కుటుంబం.. పెదకర్మ నిర్వహించి అభిమానం చాటారు! - ap politics
Family held funeral to dog : అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్క మృతితో.. ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఆ శునకం జ్ఞాపకార్దం శాస్త్రోక్తంగా పెదకర్మ నిర్వహించి.. పెంపుడు కుక్కపై అభిమానాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సీతారామరాజు జిల్లా పెదబయలులో అల్లూరి మౌళి, అరుణ అనే దంపతులు 18 ఏళ్ల క్రితం చిన్న కుక్క పిల్ల ను తెచ్చి పెంచుకున్నారు. దానికి డాగీ అని నామకరణం చేశారు. నాటి నుంచి ఆ కుక్క ఇంట్లో పిల్లలతో పాటు ఓ కుటుంబ సభ్యుడిగా మమేకమై మెలగసాగింది. అయితే ఆ కుక్క ఇటీవల అనారోగ్యంతో.. చనిపోవడంతో ఆ కుటుంబం బోరున విలపించింది. దాంతో ఆ శునకం ఆత్మకు శాంతి కలగాలని.. శాస్త్రోక్తంగా కర్మ క్రియలను నిర్వహించారు. పదవ రోజున పెదకర్మ నిర్వహించి.. పదిమందికి భోజనాలు ఏర్పాటు చేశారు. కరోన సమయంలో యజమాని మౌళి చనిపోవడంతో ఆ శునకం యజమాని కనిపించకపోవడంతో చాలా రోజులు తిండి మానేసింది. అలా నీరసించిపోయింది. ఈ జులై 19న మూడేళ్ల తర్వాత 18 ఏట అనారోగ్యంతో చనిపోయింది. దీంతో కుటుంబ పెద్దదిక్కు కోల్పోయినా తమతో పాటు ఓ విశ్వాస బంధం దూరం కావడంతో.. ఆ కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా మారింది. కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్న కుక్క మరణించటంతో ఆ కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ శునకంతో తమకెంతో అనుబంధం ఉందని, శునకం మరణించిన వార్త తమ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చిందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు.