Fake SI Arrest: నేను ఎస్ఐని.. 50 వేలు పంపించు.. అరెస్టు చేసిన పోలీసులు - cyber crime
Fake SI Arrest in Kambham : తాను ఎస్ఐ అని చెప్పి ఎస్బీఐ సేవా కేంద్రం నిర్వాహకుడి నుంచి 50 వేల రూపాయలు కాజేశాడో నిందితుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కంభంలో జరిగింది. అతడిని కంభం బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసినట్లు సీఐ రాజేష్ కుమార్ శనివారం తెలిపారు. స్థానిక పంచాయతీలో ఎస్బీఐ సేవా కేంద్రం నిర్వహిస్తున్న పింజారి సద్దాం హుస్సేన్‌కు ఈ నెల 13న పల్నాడు జిల్లా పసర్లపాడు గ్రామానికి చెందిన రాజేంద్ర నాయక్ ఫోన్ చేశారు. తాను ఎస్ఐను అని చెప్పి తన పాప కళాశాల ఫీజు చెల్లించాలని 50 వేల రూపాయలు యూపీఐ నంబర్‌కు బదిలీ చేస్తే 30 నిమిషాలలో వచ్చి డబ్బు ఇస్తామని నమ్మబలికాడు. దీంతో హుస్సేన్ ఆ నంబర్‌కు డబ్బు బదిలీ చేశారు. కొంత సమయం తరువాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బాధితుడు పోలీసులకు అదే రోజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇతను గతంలో తెలంగాణ రాష్ట్రంలోనూ, అన్నమయ్య, నెల్లూరు, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలాగే మోసం చేసి నగదు కాజేసినట్లు సీఐ తెలిపారు.