KVP on YS Sharmila: త్వరలో కాంగ్రెస్‌లోకి షర్మిల: మాజీ ఎంపీ కేవీపీ
congress leader KVP Ramachandra Rao comments: వైఎస్సార్ తెలంగాణ (వైతెపా) పార్టీ అధ్యక్షురాలు షర్మిల త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని.. రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వెల్లడించారు. ఓ కాంగ్రెస్ వాదిగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆమె (షర్మిల) పార్టీలోకి వస్తే తామంతా సాదారంగా ఆహ్వానిస్తామన్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసేందుకు కేవీపీ రామచంద్రరావు విచ్చేశారు.
ఏపీలో కాంగ్రెస్‌ను అభివృద్ధి చేస్తున్నాం..ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..''నాకున్న సమాచారం మేరకు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓ కాంగ్రెస్ వాదిగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అయినటువంటి షర్మిల .. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, మేమంతా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాము. నేనేదో ఈ 2024 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని చెప్పటంలేదు గానీ.. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహకారంతో మళ్లీ పార్టీ పునర్నిర్మాణం, పునర్వైభవం తీసుకొస్తాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అగ్రనేత రాహుల్ గాంధీకి స్థానిక పరిస్థితులను వివరిస్తాం. పార్టీని ఇటుక ఇటుక పేర్చుకుంటూ అభివృద్ధి చేస్తున్నాం. విభజన హామీల అమలుపై కేంద్రంపై ఒత్తిడి చేయకుండా వైఎస్సార్సీపీ, టీడీపీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను ప్రజలు గుర్తిస్తున్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల తప్పిదాల వల్ల ఈ రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వైఖరి వల్ల.. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రజల మనసులను గెలుచుకుంటుందని విశ్వసిస్తున్నాము.'' అని ఆయన అన్నారు.