Dalits Stop Jagananna Colony Works: దళితుల ఇళ్ల స్థలాల్లో జగనన్న కాలనీ నిర్మాణ పనులు.. మరోసారి ఉద్రిక్తత - బాలేరులో జగనన్న కాలనీ పనులను దళితులు అడ్డుకున్నారు
Dalits Stop Jagananna Colony Works In Baleru : తమకు గతంలో ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చిన భూమిలో జగనన్న కాలనీలు ఎలా నిర్మిస్తారంటూ దళితులు మరోసారి అడ్డుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం బాలేరు గ్రామానికి చెందిన పలువురు అధికారులను ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు కోసం తమకు ఇచ్చిన పట్టాల స్థలాల్లో ఇప్పుడు ఎలా జగనన్న ఇల్లు కడతారని అధికారులు నిలదీశారు. పోలీసుల సహకారంతో పనులు చేపట్టేందుకు వచ్చిన అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో కొద్ది సమయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాలేరు ఎస్సీ కాలనీకి చెందిన 30 మందికి 1960లో చేనేత సొసైటీ ఆధ్వర్యంలో వంశధార నది సమీపంలో సర్వే నెంబర్ 94 లో ఒక్కొక్కరికి మూడు సెంట్లు చొప్పున పట్టాలు ఇచ్చారు. ఆ స్థలాల్లో దళితులు వేసుకున్న పాకలు 1980లో వంశధార వరదలు కొట్టుకుపోయాయి. అనంతరం తిరిగి మీరు నిర్మించుకున్న గుడిసెలు 2007లో సంభవించిన అగ్ని ప్రమాదానికి ధ్వంసమయ్యాయి.
అప్పటి నుంచి వీరంతా వేరే చోట నివసిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఖాళీ స్థలాన్ని జగనన్న లేఔట్లకు ఇచ్చి అదే గ్రామంలోని పలువురికి పట్టాలు అందజేశారు. దీంతో రెండేళ్ల కిందట అక్కడ ప్రారంభించిన పనులను దళితులు అడ్డుకున్నారు. ఆ స్థలంపై హక్కు పత్రాలు చూపించడంతో అప్పట్లో తహసిల్దారులు వెను తిరిగారు. తాజాగా జగనన్న సురక్ష కార్యక్రమానికి వచ్చిన ఐటీడీఏ పీవో కల్పనా కుమారి ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. దీంతో పనులు చేయించేందుకు రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో సదరు భూమిని చదును చేసేందుకు ప్రయత్నం చేయగా బాధితులు అడ్డుకున్నారు. తహసీల్దార్ అప్పారావు వారికి నచ్చి చెప్పే ప్రయత్నం చేసిన వారు వినిపించుకోలేదు. దీంతో కొద్ది సమయం అధికారులకు పట్టాలు పొంది ఉన్న హక్కుదారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టకేలకు అధికారులు చేసేది లేక వెనుతిరిగారు.