సంక్రాంతి సంబరాలు - ఫ్లడ్ లైట్ల వెలుగులోనూ కోడిపందేలు - Cockfights under floodlights
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 14, 2024, 9:58 PM IST
|Updated : Jan 15, 2024, 6:41 AM IST
Cockfights under Floodlights in Andhra Pradesh: గోదావరి జిల్లాలలో సంక్రాంతి సంబరాల పేరుతో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. రాత్రి సమయంలోను ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. కోడిపందేలతో పాటు గుండాటలు, పేకాటలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల పాటు సాగుతున్న ఈ ఆటల్లో కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి. ఉదయం ప్రారంభమైన కోడిపందేలు రాత్రి అయినప్పటికీ కొనసాగుతున్నాయి. ఫ్లడ్ లైట్లు పెట్టి మరీ ఆ వెలుగులలో కోడిపందేలు నిర్వహిస్తున్నారు. తణుకు, తేతలి, దువ్వ వేల్పూరు తదితర ప్రాంతాల్లో లైట్ల వెలుగుల్లో కోడిపందేలు, పేకాటలు కొనసాగుతున్నా, పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కోడి కూరతో భోజనం: తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ప్రతీ సంవత్సరం సంక్రాంతికి కోడిపందేలు భారీగా జరుగుతాయి. ఎప్పటి మాదిరిగానే నాలుగు చోట్ల పందేలకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ సారు కోడిపందేలు చూడటానికి వచ్చిన వారికి సైతం, కోడి మాంసం కూరతో భోజనం పెట్టారు. పందెం రాయుళ్లు, పందేలు చూడ్డానికి వచ్చిన వారికి సైతం రెండు సార్లు భోజనాలు పెట్టారు. కోడిపందేల నిర్వాహకులు ఇచ్చిన భోజనం ఆఫర్ గురించి తెలిసిన వారు మాత్రం అవురా ఇదేమి చోద్యం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.