R5 zone houses: ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై జెట్ స్పీడ్‌తో జగన్ సర్కార్ అడుగులు - CM Jagan Sabha in Venkatapalem
R5 zone houses Construction: అమరావతిలోని R-5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై.. హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచినప్పటికీ ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి ముందడుగు వేస్తోంది. ఈ నెల 24న ముఖ్యమంత్రి జగన్ కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. 24వ తేదీ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు సీఎం.. తాడేపల్లి నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి కృష్ణాయపాలెం చేరుకుంటారు. కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణ పైలాన్ ఆవిష్కరిస్తారు. ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అక్కడ నిర్మించిన నమూనా గృహాన్ని సీఎం పరిశీలిస్తారు. అనంతరం హెలికాఫ్టర్‌లో బయల్దేరి వెంకటపాలెంలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. సభలో లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పత్రాలు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి లబ్ధిదారులు హాజరు కానున్నారు. 12 గంటల 20 నిమిషాలకు సీఎం సభ ముగించుకుని తాడేపల్లి నివాసానికి వెళ్తారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
ఇళ్లు నిర్మించి తీరుతాం: అమరావతిలోని ఆర్-5 జోన్‌లో పంపిణీ చేసిన సెంటు స్థలంలో ఇళ్ల నిర్మాణం చేసి తీరుతామని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈనెల 24న అమరావతిలో CM జగన్ పర్యటన ఏర్పాట్లను.. మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జునతో కలిసి సజ్జల పరిశీలించారు. కృష్ణాయపాలెంలో నిర్మించిన ఇంటి నమూనా, సభా ఏర్పాట్లను పరిశీలించిన సజ్జల.. సెంటు స్థలాలను అడ్డుకునేందుకు రైతుల ముసుగులో స్థిరాస్తి వ్యాపారులు న్యాయస్థానాల్లో కేసులు వేశారని తెలిపారు. రాజధానిపై న్యాయస్థానాల్లో ఉన్న కేసులు ఎత్తివేస్తే.. ఏడాదిలో అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కేంద్రం సహకరించకున్నా ఇళ్లు నిర్మించి తీరుతామని సజ్జల తేల్చి చెప్పారు.