Fake Police: ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో నకిలీ పోలీసు ముఠా అరెస్ట్
Fake Police Arrest: ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో హల్చల్ చేసిన నకిలీ పోలీసు ముఠాను వి.కోట పోలీసులు అరెస్టు చేశారు. త్వరలో 2,000 రూపాయల నోట్లు రద్దు అని జరుగుతున్న ప్రచారాన్ని ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేసిన ఈ ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అసలేం జరిగిందంటే?..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం, ములబాగిల్ సమీపంలోని జమీర్ శ్రీనివాసపురానికి చెందిన రియాజ్ అనే వ్యక్తికి కొంతమంది దుండగులు.. త్వరలో రూ.2,000 నోట్లు రద్దవుతాయని చెప్పారు. ఈ మేరకు తమకు తెలిసిన ఓ స్వామీజీ దగ్గర ఈ నోట్లను మార్చుకోవాలని.. ఆ వ్యక్తికి సూచించారు. దీంతోపాటు ఆ స్వామీజీకి రూ.2,000 నోట్లను ఇస్తే.. తమకు లక్షకు ఇరవై వేల చొప్పున అదనపు నగదును తిరిగి ఇస్తారని చెప్పారు.
దీంతో ఇది నిజమేనని నమ్మిన బాధితుడు.. గత నెల 28వ తేదీన రూ.5 లక్షల రూపాయలను దుండగుల వద్దకు తీసుకుని వెళ్లాడు. అంతలోనే కర్ణాటక పోలీసుల వేషంలో ఈ ముఠాకు చెందిన మరికొంతమంది వ్యక్తులు వచ్చి.. రియాజ్ను బెదిరించి రూ.5 లక్షలను బలవంతంగా ఎత్తుకెళ్లారు. దీంతో లబోదిబోమంటూ బాధితుడు వి.కోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వాహనాలకు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన సోదాలో పోలీసుల కంటపడిన.. నకిలీ పోలీసులు పారిపోయే యత్నం చేశారు.
చాకచక్యంగా ఈ దుండగులను పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజాలు బయటికి వచ్చాయి. ఈ నకిలీ పోలీసు ముఠాను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.2.5 లక్షలను స్వాధీనం చేసుకుని.. వారిని రిమాండ్కు పంపించినట్లు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. వీరిపై గతంలో కూడా చాలా కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.