Volunteer attack on Old Woman: వృద్ధురాలిపై దాడి.. ఉత్తమ వాలంటీర్ నిర్వాకం - Purushottamreddy
Best village volunteer attack on old lady : గ్రామ వాలంటీర్ అనే అహంకారం కాబోలు.. తప్పు తన వైపు ఉన్నా ఎదురు దాడికి దిగాడు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచాడు. అలాంటి వ్యక్తిని ప్రభుత్వం ఇటీవల ఉత్తమ వాలంటీర్ గా అవార్డు అందించి సత్కరించడం గమనార్హం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిన్న రామాపురం పంచాయతీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుల కథనం మేరకు వివరాలివీ.. వాలంటీర్‌కు సంబంధించిన పశువులు గ్రామ సమీపంలోని పంట పొలాలను నాశనం చేస్తుంటే వ్యవసాయదారులు వాటిని తరిమేశారు. ఇదే విషయాన్ని వాలంటీర్ కి రెండు మూడు సార్లు తెలియచేసినప్పటికీ పట్టించుకోకపోగా కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డాడు. మండలంలోని చిన్న రామాపురం పంచాయతీలో భీమవరం గ్రామానికి వాలంటీర్‌గా పని చేస్తున్న పురుషోత్తం రెడ్డిపై గతంలో కూడా మూడుసార్లు పోలీస్ స్టేషన్లో గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం పురుషోత్తం రెడ్డికి సంబంధీకుల పశువులు నాగేశ్వరరావు అనే రైతు పంట పొలాలపై పడడంతో వాటిని తరిమేశారు. దీంతో ఆగ్రహించిన వాలంటీర్ పురుషోత్తం రెడ్డి... ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో 9 మంది యువకులతో కలిసి నాగేశ్వరరావు ఇంటిపైకి దాడికి వెళ్లారు. నాగేశ్వరరావు ఇంట్లో లేకపోవడంతో ఒంటరిగా ఉన్న అతడి వదిన సుశీలపై పురుషోత్తం రెడ్డితో పాటు అతడి సోదరుడు దామోదర్ రెడ్డి స్నేహితులు కర్రలతో దాడి చేశారు. సుశీలమ్మ అరుపులు విన్న గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకోగా యువకులు తప్పించుకు పారిపోయారు. సుశీలమ్మతో పాటు గ్రామస్థులందరూ రెండు ట్రాక్టర్లతో చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పురుషోత్తం రెడ్డి, దామోదర్ రెడ్డి అతని స్నేహితులపై ఫిర్యాదు చేశారు. అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించారు. సుశీలమ్మ ఫిర్యాదుపై విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్సై వంశీధర్ తెలిపారు. వాలంటీర్ పురుషోత్తం రెడ్డి గ్రామస్థులను పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఇసుక, మట్టి దందాలకు పాల్పడుతున్నాడని, సహకరించని వారిపై కక్షపూరిత చర్యలు చేపడుతున్నట్లు గ్రామస్థులు ఆరోపించారు.