కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ - ఓటర్ల జాబితాలో అవకతవకలపై సమీక్ష! - Andhra Pradesh districs news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 1:32 PM IST
|Updated : Dec 22, 2023, 1:44 PM IST
Central EC Officials Meeting With Collectors, SPs: ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. పర్యటనలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ప్రధానంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024, రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధత వంటి అంశాలపై సమావేశంలో ఈసీ చర్చించనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఓటర్ల జాబితాల్లో నెలకొన్న అక్రమాలు, అవకతవకలు, లోపాలపై ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై అధికారులు ఈసీ బృందానికి నివేదికలు సమర్పించనున్నారు.
CEC Officials Meeting Has Started: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఈసీ అధికారుల సమావేశం నిర్వహించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఏడుగురు అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్‌కే గుప్తా, హిర్దేశ్‌కుమార్, అజయ్‌బాదో తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలపై ఈసీకి గతంలో అందిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై కలెక్టర్లను ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.