ఓటర్ల జాబితా అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి- తొలిరోజు సమీక్షలో అధికారులతో సుదీర్ఘ చర్చ - central Election Commission news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 22, 2023, 8:15 PM IST
|Updated : Dec 22, 2023, 9:02 PM IST
CEC Officials Meeting Concluded: ఎన్టీఆర్ జిల్లావిజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో రాష్ట్ర కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. నేటి సమీక్ష సమావేశంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ, ఓటర్ల జాబితాల అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సుదీర్ఘంగా చర్చించి, సమగ్ర వివరాలను సేకరించారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై ఈసీ అధికారులకు పీపీటీ ద్వారా పలు జిల్లాల కలెక్టర్లు వివరణ ఇచ్చారు.
Mukesh Kumar Meena Comments: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక విషయాలు వెల్లడించారు. ఓటర్ల జాబితాల్లో నెలకొన్న అవకతవకలు, లోపాలపై వచ్చిన దరఖాస్తులన్నింటినీ దాదాపుగా పరిష్కరించామని ఆయన పేర్కొన్నారు. మరో లక్ష దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. త్వరలోనే రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై అధికారులతో రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు సమీక్షలో ప్రధానంగా ఓటర్ల జాబితాల అవకతవకలపై ఈసీ బృందం సుదీర్ఘంగా చర్చించింది.