అక్రమంగా ఓట్లు తొలగింపు - జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయించిన పెద్దాపురం గ్రామస్థులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 9:38 PM IST
Cancellation of Votes in NTR District :తమ ఓట్లను అక్రమంగా తొలిగించారంటూ ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామస్థులు జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయించారు. తొలగించిన ఓట్లను తిరిగి ఓటరు జాబితాలో చేర్చాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. వైద్యం, ఉపాధి పనులు, పిల్లల చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నామని పేర్కొన్నారు. దీనిని సాకుగా చూపించి ఓట్లను తొలగించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ఇళ్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు వంటివి గ్రామంలోనే ఉన్నప్పటికీ తమ ఓట్లను అన్యాయంగా తొలగించారని బాధితులు వాపోయారు. టీడీపీ సానుభూతిపరులు అనే నెపంతో తమ ఓట్లను తొలగించారని పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయకక్షతో చేసిన పనిగా ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయిస్తున్నట్లు బాధితులు వెల్లడించారు. తమ గ్రామంలో ఇలా ఓట్లు కోల్పోయిన వారు దాదాపు 50 మంది దాకాా ఉన్నారని తెలియజేశారు.