Boat Capsized in Sea Three People Dead: పడవ బోల్తా ప్రమాదం.. గల్లంతయిన ముగ్గురి మృతదేహాలు లభ్యం - చిన్నారులతో సహా సముద్రంలో గల్లంతైన మహిళ
Boat Capsized in Sea Three People Dead: బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ సముద్ర ముఖద్వారం సమీపంలో ఆదివారం జరిగిన పడవ బోల్తా ప్రమాదంలో గల్లంతయిన ముగ్గురి మృతదేహాలు దొరికాయి. రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టిన అధికారులకు తీరం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన మృతదేహాలు లభ్యం అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ గ్రామానికి చెందిన సోంబాబు చేపల వేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం భార్య సాయి వర్ణిక(25), పిల్లలు.. తనిశ్ కుమార్ (7), తరుణేశ్వర్ (11 నెలలు)లతో అత్తగారి ఊరు బాపట్ల మండలం ముత్తాయిపాలెంకు బోటులో వెళ్లేందుకు బయలుదేరారు. వచ్చే దారిలో పట్టిన చేపలను.. నిజాంపట్నం హార్బర్ వద్ద అమ్ముకుని వెళ్లాలని అనుకున్నారు. అయితే హార్బర్ సముద్ర ముఖద్వారం వద్దకు చేరుకోగానే అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో పడవ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సోంబాబు ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే భార్య, ఇద్దరు పిల్లలు.. భర్త కళ్ల ముందే సముద్రంలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ముగ్గురి మృతదేహాలుగా తీరం ఒడ్డుకు కొట్టుకువచ్చారు. ఈ ప్రమాదంలో చిన్నారులతో సహా భార్య మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.