BJP Satya Kumar Comments భూములను కబ్జా చేసేందుకే చుక్కల భూములను తెరపైకి తీసుకొచ్చారు: సత్యకుమార్ - వైఎస్సార్సీపీపై సత్యకుమార్ వ్యాఖ్యలు
Satya Kumar Comments: ప్రజల ఆస్తులైన.. నాలుగు లక్షల ఎకరాల భూములను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఆస్థాన కంపెనీలైన అరబిందో, షిర్డీ సాయిలకు అప్పగిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ మండిపడ్డారు. భూములను కబ్జా చేసేందుకే చుక్కల భూములను తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. మూడున్నర లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర అప్పు ఇప్పుడు పది లక్షల కోట్లకు చేరిందని.. ఒక్కక్కరిపై లక్షా 80 వేల రూపాయల అప్పు ఉందని తెలిపారు. తొమ్మిదేళ్ల కాలంలో బీజేపీ దేశ వ్యాప్తంగా 5 వేల కిలోమీటర్ల జాతీయ రహదాల నిర్మాణం చేపట్టిందని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లాలో కూడా రహదారులను నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యాచారాలు, దాడులు, హత్యలు ఎక్కువయ్యాయని.. శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. దివ్యాంగుల స్థలాలను కూడా అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తుంటే.. వారికి అధికారులు వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వైసీపీ నాయకులు.. ప్రజలను దోచుకోవడం, పీడించడం తప్ప ఏ ఒక్క పనీ చేయడం లేదని చెప్పారు. ప్రకృతి ప్రసాదించిన వనరులన్నింటినీ వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని అన్నారు.