సర్వరాయ ప్రాజెక్టు పరిధిలో సాగునీటికి మంగళం - భారతీ సిమెంట్ ఫ్యాక్టరీకి నీటి మళ్లింపు : బీజేపీ - రైతులను సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 5:22 PM IST
BJP Leader Satyakumar Visited the Sarvaraya sagar Project : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలో.. రైతులను, సాగునీటి రంగాన్ని ఏ మాత్రం పట్టించుకోవడంలేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. వైఎస్సార్ జిల్లా వీఎన్పల్లి మండలంలోని సర్వరాయ సాగర్ ప్రాజెక్టును పార్టీ స్థానిక నేతలతో కలిసి సందర్శించారు. ఈ ప్రాజెక్ట్ నుంచి భారతీ సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రత్యేక జీవో తీసుకువచ్చి నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు.
సర్వరాయ ప్రాజెక్ట్ కింద 25 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ.. ఒక ఎకరాకు కూడా సాగునీరు అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కాలువలు తవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తమ వారి కోసం నీటిని తరలిస్తుందని మండిపడ్డారు. గండికోట ప్రాజెక్ట్ నుంచి సర్వరాయ సాగర్, వామికొండ రిజర్వాయర్లకు నీటి తరలించాల్సి ఉన్నప్పటికీ.. సరైన కాలువలు తవ్వకపోవడం వల్ల చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు అందడం లేదని ఆక్షేపించారు. బీజేపీ పార్టీ రైతుల తరపున పోరాడి, వారికి రక్షణగా ఉంటుందని తెలిపారు.