Model House in cents land: సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి 24న భూమిపూజ.. శరవేగంగా మోడల్ హౌస్ నిర్మాణం
Model House in cents land: రాజధానిలోని ఆర్ 5 జోన్ పేదలకు ఇచ్చిన సెంటు స్థలాల్లో అధికారులు మోడల్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఈనెల 24న ముఖ్యమంత్రి జగన్ సెంటు భూముల్లో ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోడల్ ఇల్లు, పైలాన్ నిర్మాణం యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. షీర్ వాల్ టెక్నాలజీ పద్ధతిలో ఇళ్లను నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి భూమి పూజ చేసే నాటికి ఒక ఇంటిని పూర్తి స్థాయిలో నిర్మించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. హాలు, వంటగది, పడకగది, టాయిలెట్స్ సెంటు స్థలంలోనే నిర్మించనున్నారు.
మరోవైపు పేదలకు ఇచ్చిన సెంటు స్థలం లేఅవుట్‌లో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం లేఅవుట్‌లో సుమారు 900 మందికి సెంట్ స్థలాలను కేటాయించగా.. విద్యుత్ సరఫరా కోసం స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షానికి సెంట్ స్థలాల్లో భారీగా నీరు చేరింది. చిరుజల్లులకే నీళ్లు చేరితే.. భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక.. సెంట్ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ఈనెల 24న ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ చేయనున్నారు. సీఎం జగన్ పైలాన్ ఆవిష్కరించనుండగా ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి.