BC Welfare Association President Kesana Shankar Rao: 'బీసీల సంక్షేమం గాలికొదిలేసిన వైసీపీ సర్కారు.. బీసీలపై పెరిగిన దాడులు' - BC Welfare Association
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2023, 10:12 PM IST
BC Welfare Association President Kesana Shankar Rao: రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్ రావు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆదివారం రాష్ట్ర బీసీ సంఘం విస్త్రత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్ రావు పాల్గొన్నారు.
రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి 7 అంశాలను ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. ఇటీవల పార్లమెంటులో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో 33% వాటాలో ఓబీసీ మహిళలకు వాటా ఎంత అని ఆయన ప్రశ్నించారు. బీసీలను చైతన్య పరిచేందుకు బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చామని గొప్పలు చెప్పుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. వారి సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు అధిక సీట్లు ఇవ్వని పార్టీలతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు. బీసీ సంఘానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు.