Traders Attacked: ధర్మవరం వ్యాపారులను నిర్బంధించి దుస్తులూడదీసి దాడి.. వీడియో వైరల్ - attack on Dharmavaram silk sarees traders Video
Dharmavaram silk sarees traders Attacked: ధర్మవరం చేనేత పట్టుచీరల వ్యాపారులు ఇద్దరిని విజయవాడలోని ఓ వస్త్ర దుకాణ యజమాని, సిబ్బంది నిర్బంధించి చితకబాదారు. రెండు వారాల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. ధర్మవరానికి చెందిన పట్టుచీరల వ్యాపారి ఒకరు విజయవాడ పటమట సాయిబాబా ఆలయ ప్రాంతంలో ఉన్న ఓ వస్త్ర దుకాణానికి పట్టుచీరలు ఇచ్చాడు. డబ్బు వసూలుకు అతడు పలుమార్లు విజయవాడ దుకాణ యజమానిని సంప్రదించినా వసూలు కాలేదు. రెండు వారాల కిందట సదరు వ్యాపారి ధర్మవరంలో ఉన్న మరో వ్యాపారిని వెంట తీసుకెళ్లి విజయవాడ వస్త్రదుకాణ యజమానిని డబ్బులు అడిగారు.
ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. వివాదం ముదరడంతో విజయవాడ వస్త్ర దుకాణంలోనే ఒక గదిలో ధర్మవరం వ్యాపారులిద్దరినీ నిర్బందించి వారితో దుస్తులు ఊడదీయించి కర్రతో బెదిరించారు. ఈ దృశ్యాలను వస్త్ర దుకాణం వారే వీడియో తీశారు. 27, 46 సెకన్ల నిడివితో ఉన్న రెండు వీడియోలను ధర్మవరంలోని పలువురు చీరల వ్యాపారులకు వాట్సాప్లో పంపారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. విజయవాడ నుంచి ధర్మవరం వచ్చిన బాధిత వ్యాపారులు ఘటనపై పోలీసులకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో ధర్మవరం పోలీసు వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ విషయాన్ని పటమట పోలీసుల వద్ద ప్రస్తావించగా దీనిపై తమకెలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు.