Dharmanna On Assigned land: అసైన్డ్ భూములపై వైసీపీలా మరెవరూ శ్రద్ధ పెట్టలేదు: మంత్రి ధర్మాన
Minister Dharmana Prasada Rao Key comments on assigned lands: అసైన్డ్ భూములకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూమికి సంబంధించి, భూ యాజమాన్యానికి సంబంధించి పెద్ద ఎత్తున సంస్కరణలు, మార్పులు, ప్రయోజనకరమైన నిర్ణయాలను తీసుకొచ్చామని పేర్కొన్నారు. అసైన్డ్ భూమిపై ఈ ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ మరెవరూ పెట్టలేదని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు.
భూమిపై మా ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ ఎవరూ పెట్టలేదు..రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసైన్డ్ భూములకు సంబంధించి శుక్రవారం రోజున మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..''గత 20 ఏళ్లుగా భూమి సాగు చేసుకునే వారికి ఆ భూమిపై అన్ని హక్కులను ఇప్పుడు కల్పించాం. అసైన్డ్ భూమిని ఇవ్వడం అంటే.. హోదాను పెంచడం కోసం కాదు.. అమ్ముకోవడం కోసం కాదు.. అసైన్డ్ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నా.. హక్కులు ఆ భూమి పొందిన వారివే. 20 ఏళ్లపాటు భూమిని సాగు చేసుకున్న వారికి ఇప్పుడు పూర్తి హక్కులను కల్పిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 21 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి ఉంటే...అందులో 19 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ అసైన్డ్ భూముల విషయంలో మా ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ.. ఎవరూ పెట్టలేదు'' అని ధర్మాన ప్రసాదరావు అన్నారు.