AP Sarpanches Meeting: 'నిధులివ్వకుంటే.. ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తాం..' - ఏపీ సర్పంచ్ల నిరసన
AP Sarpanches Meeting: పంచాయతి సర్పంచ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ జులై 3న పంచాయతిరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడించనున్నట్లు ఏపీ సర్పంచ్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావు తెలిపారు. గుంటూరులో ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం కార్యవర్గం సమావేశమై ఈ మేరకు నిర్ణయం వెల్లడించింది. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం.. సర్పంచ్లను భిక్షాటకులు మాదిరిగా చూస్తోందని విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు సర్పంచ్లకు ఇవ్వకుండా ఆపేశారని, కేంద్రం ఇచ్చే నిధుల్ని ఆపేయటం ఏ మేరకు సబబు..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం దీనిపై స్పందించకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో అభివృద్ధి సంగతి అటుంచితే.. కనీసం బ్లీచింగ్ వేసే పరిస్థితి కూడా లేదని గుంటూరు జిల్లా బండారుపల్లి సర్పంచ్ మనోహర్ ఆవేదన వెలిబుచ్చారు. గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని బాపట్ల జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ అన్నారు. గ్రామాల్లో వేసవిలో తాగునీరు అందించేందుకు కూడా ఇబ్బందులు పడ్డామని తెలిపారు.