Save Vizag Steel March: సేవ్ వైజాగ్ స్టీల్ మార్చ్ పేరుతో ఏపీ కాంగ్రెస్ భారీ ర్యాలీ - విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి
AP Congress Save Vizag Steel March in Visakha: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతునే ఉన్నాయి. ప్రైవేటికరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గి యథావిథిగా కొనసాగించాలని పలు సంఘాలు పోరాటం చేస్తునే ఉన్నాయి. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి, ఏపీ కాంగ్రెస్ నిరసన తెలిపాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ను రక్షించాలని.. ఏపీ కాంగ్రెస్ కమిటీ, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 'సేవ్ వైజాగ్ స్టీల్ మార్చ్' కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవ్ వైజాగ్ స్టీల్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జింక్ గేట్ నుంచి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి దీక్షా శిబిరం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో.. పీసీసీ అధ్యక్షుడు గిడుగురుద్ర రాజు, కాంగ్రెస్ నేతలు, కార్మికులు, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం గాజువాక కూడలిలో రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు పోరాడతామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.