YCP MP Protest on temple: గుడి మూసివేతపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆందోళన..వీడియో వైరల్ - MP Gorantla Madhav news
YCP MP Gorantla Madhav is concerned about the closure of Birappa temple: అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఉన్న బీరప్ప ఆలయం మూసివేతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆందోళనకు దిగారు. గత రెండు రోజులుగా ఆలయ మూసివేతపై నిరసన చేస్తున్న కురబలకు మద్దతునిస్తూ.. ఎంపీ మాధవ్ ఆలయం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. మూసివేసిన బీరప్ప ఆలయాన్ని వెంటనే తెరవాలంటూ కురబలతో కలిసి ఆయన నినాదాలు చేశారు. ఈ నిరసనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌గా మారాయి.
బీరప్ప ఆలయాన్ని మూసివేసిన వైసీపీ నేతలు.. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల నిర్వహణలో ఉందంటూ.. అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఉన్న బీరప్ప ఆలయాన్ని రెండు రోజులక్రితం అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు మూసివేయించారు. గతంలో జేసీ దివాకర్ రెడ్డి అభివృద్ధి నిధుల నుంచి గ్రామంలో మహిళా ప్రగతి భవనం నిర్మించారు. దీనికి ఆవరణలోనే బీరప్ప ఆలయం ఉంది. ఈ గుడి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల నిర్వహణలో ఉందంటూ వైఎస్సార్సీపీ నాయకులు దీన్ని మూసివేయించారు.
బీరప్ప గుడిని తెరవాలంటూ నినాదాలు.. దీంతో బీరప్ప ఆలయం మూసివేయడంపై కురబ సామాజికవర్గం ఆందోళనకు దిగింది. ఆలయాన్ని తెరవాలంటూ.. కురబ కార్పొరేషన్ ఛైర్మన్ కోటిబాబు ఆలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. వారికి మద్దతునిస్తూ ఆలయం వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. బీరప్ప ఆలయాన్ని వెంటనే తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, అధికారం పార్టీకి చెందిన ఒక ఎంపీ.. మూసివేసిన గుడి తలుపులను వెంటనే తెరవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు గుడి మూసివేయించిన వైసీపీ నేతలపై గ్రామస్థులు, కురబలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.