అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని నెరవేర్చని సీఎం జగన్ - గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులు ర్యాలీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 10:20 AM IST
Agrigold Victims Demand That Solve Problems Government: ప్రతిపక్ష నాయకుని హోదాలో ఇచ్చిన ఏ హామీని సీఎం జగన్ నెరవేర్చలేదని అగ్రిగోల్డ్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్వంలో గుంటూరులోని కె.కె ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బాధితులు ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలను సీఎం జగన్ వెంటనే పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్కు అగ్రిగోల్డ్ బాధితులు వినతిపత్రం అందజేశారు.
గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్ 10 లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించారని, నేటికి అది ఆచరణకు నోచుకోలేదని అగ్రిగోల్డ్ బాధితులు వాపోయారు. సీఎం జగన్ పాలన ముగుస్తున్నప్పటీ, తమకు మాత్రం న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల గోడు చెప్పుకునేందుకు సైతం సీఎం అనుమతి ఇవ్వలేదని ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఈ నెల 28, 29 తేదీల్లో విజయవాడలో 30 గంటలపాటు దీక్ష చేపడుతున్నామని, అప్పటికీ స్పందించకుంటే జనవరి నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.