GHRSHANA: వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ.. ఏడుగురికి గాయాలు.. ఎక్కడంటే..? - తెలుగుదేశం పార్టీ వార్తలు
Clash in YSR District Seven people injured: ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు రెండు వర్గాలుగా ఏర్పడి.. ఒకరిపై ఒకరు ఘర్షణలకు పాల్పడుతున్న సంఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైయస్సార్ జిల్లాలో జరిగిన ఘర్షణ సంచలనంగా మారింది. అధికార పార్టీకి చెందిన రెండు వర్గాలు ఒకరిపై మరొకరు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో ఏకంగా ఏడుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. వైయస్సార్ జిల్లా కాశినాయన మండలం గంగన్నపల్లె గ్రామంలో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు రాళ్ల దాడికి పాల్పడంతో ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఘర్షణ జరగడానికి కారణం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, అదే పార్టీకి చెందిన దశరధ రామిరెడ్డి వర్గీయుల మధ్య గ్రామ సచివాలయ నిర్మాణ పనుల బిల్లుల చెల్లింపుల్లో వివాదమే. ఈ వివాదం కాస్తా.. రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోరుమామిళ్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉన్న ప్రకారం..దాడిలో గాయపడిన ఓ వ్యక్తికి వైద్యురాలు చికిత్స అందిస్తుండగా, మరొక వ్యక్తి తీవ్రమైన రక్తంతో దుస్తులు తడిసి కుర్చిపై కూర్చోని ఉన్నారు. కుర్చిపై ఉన్న అతనికి తలపై గాయం, శరీరంపై గాయాలున్నట్టు కనిపిస్తుంది. వారి పక్కనున్న మరొక వ్యక్తి ఘటన సమయంలో జరిగిన విషయాలను పోలీసు అధికారికి వివరిస్తున్నారు.