నటి సమంత అక్కినేని రెండేళ్ల కిందట 100 కిలోల బరువుతో స్క్వాట్స్ చేస్తున్న వీడియో సంచలనం సృష్టించింది. అంత సుకుమారమైన అమ్మాయి ఇంత భారీ బరువులు మోయడం ఏంటని చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ కఠోరమైన వ్యాయామాలు అవసరమా? అని నిష్ఠూరమాడిన వాళ్లూ లేకపోలేదు. సమంతానే కాదు.. హీరోయిన్ రకూల్‌ప్రీత్ సింగ్.. బాలీవుడ్‌లో బక్కపల్చని అమ్మాయిలు దిశా పటానీ, దీపికా పదుకొణెలు సైతం భారీ బరువులెత్తుతూ హంగామా చేసిన సంగతి తెలిసిందే. 2013లో పీపుల్స్ మ్యాగజైన్ ‘సెక్సీయెస్ట్ విమెన్’గా ఎంపికైన కేట్ అప్టన్ అయితే 200 పౌన్ల బరువుతో హిప్ థ్రస్ట్, 500 పౌన్లతో స్లెడ్ వ్యాయామాలు చేస్తుంటుంది. మంచి శరీరాకృతి కావాలనుకుంటే ఇలాంటి భారీ కసరత్తులు చేయక తప్పదు అన్నది నిపుణుల మాట.
సాధారణంగా అమ్మాయిలు కార్డియో వ్యాస్కులర్‌లాంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తుంటారు. వీటితో ఆశించిన ఫలితాలు రావు. కోరుకున్న ఒంపుసొంపులు ఒంట పట్టవు. ఆ వర్కవుట్లతో ఒక దశ దాటాక కొవ్వు వేగంగా కరగదు. దీనికి తోడు గాయాల రిస్క్ కూడా ఎక్కువే. పైగా మగాళ్లతో పోలిస్తే అమ్మాయిల శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ. అది కరగాలన్నా కఠిన కసరత్తులు చేయక తప్పదు. పైపెచ్చు బరువులతో వ్యాయామం చేస్తే శరీరం అదనపు ఆక్సిజన్ తీసుకొంటుంది. కేలరీలు అధికంగా ఖర్చై జీవక్రియ వేగవంతం అవుతుంది. వర్కవుట్ ముగిశాక రోజులో మిగిలిన సమయంలో కెలోరీలు వేగంగా కరుగుతాయి. దీన్నే ఎక్సెస్ పోస్ట్ ఎక్సర్‌సైజ్ ఆక్సిజన్ కన్జంప్షన్ (ఈపీవోసీ) అంటారు. శరీరంలో కొవ్వు శాతం తగ్గి ఆ మేరకు నాజూకైన కండరాలు వృద్ధి చెందుతాయి. అప్పుడు శరీర జీవక్రియ వృద్ధి చెంది.. తీసుకొనే ఆహారంలోని కెలోరీలు వెంటనే కరుగుతాయి. మంచి శరీరాకృతి సొంతమవుతుంది. ఎలాంటి డ్రెస్‌లు వేసుకున్నా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. దృఢమైన శరీరం మీ సొంతం. ఇన్ని లాభాలుంటే అమ్మాయిలు బరువులెత్తడానికి ఉత్సాహం చూపించకుండా ఉంటారా?
కండలేం పెరగవు
భారీ కసరత్తులు చేసినప్పుడు, అధిక బరువులు ఎత్తినప్పుడు మగాళ్లలా కండలు పెరగవా? అని చాలామంది సందేహం. అలాంటిదేమీ ఉండదంటారు ఫిట్‌నెస్ గురూలు. అంటే అమ్మాయిల సౌకుమార్యానికి వచ్చిన ఇబ్బందేం లేదు. మహిళల్లో పురుషులకంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ కనీసం ఏడు రెట్లు తక్కువగా ఉంటుంది. కఠిన వ్యాయామాలు చేసినా భారీ ఆకారంతో కండరాలు పెరిగే అవకాశం లేదు. నిజానికి అబ్బాయిల్లో సైతం వ్యాయామాలు, డైట్ కాంబినేషన్ సరిగ్గా కుదిరినప్పుడే భారీగా కండరాలు వృద్ధి చెందుతాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే అమ్మాయిలూ కండరగండలు అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. వెయిట్ ట్రెయినింగ్‌తో ఆరోగ్యపరంగానూ బోలెడు లాభాలున్నాయి. ఎముకలు త్వరగా పెళుసుబారవు. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ పరిశోధనల ప్రకారం మధుమేహం, గుండెజబ్బుల ముప్పు తగ్గుతుంది. వెయిట్ ట్రైనింగ్ సమయంలో శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్ మెదడుపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి, ఇతర సమస్యల నుంచి మన ఆలోచనలను మరల్చి ఆహ్లాదంగా ఉండేట్లు చేస్తుంది.
శరీరానికో సంబరం
వ్యాయామం శిక్ష కాదు.. మన బాడీకి ఓ వేడుకలా ఉండాలి. మనం తిన్నందుకు విధించుకునే శిక్షలా ఉండకూడదు.
- రాశీ ఖన్నా
భారీ వర్కవుట్లు ఇష్టం