ప్రేమించి పెళ్లాడిన వ్యక్తి తనను మోసం చేసి వదిలేశాడన్న మనస్థాపంతో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. కడప జిల్లా రాయచోటిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రాయచోటికి చెందిన గిరిజన యువతి ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతోంది. ఆమెకు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న రాజశేఖర్‌రెడ్డితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఈ ఏడాది జులైలో ఇళ్ల నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 రోజుల తరువాత ప్రేమికులు... యువకుడి ఇంటికి వెళ్లారు. తాము ఇష్టపడే వివాహం చేసుకున్నామని తల్లిదండ్రులకు చెప్పారు. రాజశేఖర్ కుటుంబ సభ్యులు తమ ఇంట్లో శుభకార్యం ఉందని... కొన్ని రోజులు పుట్టింట్లో ఉండాలని చెప్పటంతో యువతి తన ఇంటికి వెళ్లారు. నెలలు గడిచినా కాపురానికి తీసుకెళ్లకపోవటంతో రాజశేఖర్ రెడ్డిని యువతి తల్లిదండ్రులు కోరారు. మీది తక్కువ కులం కావటంతో మా ఇంట్లో ఒప్పుకోకపోవటం లేదని అతను సమాధానం ఇచ్చాడు. మనస్తాపానికి గురైన యువతి అక్టోబర్ 29న నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి బెంగళూరులోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. రూ.20 లక్షలు ఖర్చు పెట్టినా పరిస్థితి మెరుగుపడక తమ కూతురు కోమాలోకి వెళ్లిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్చు భరించలేక ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేస్తున్నామని పేర్కొన్నారు.