బద్వేలు ఉపఎన్నికపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధాన ప్రతిపక్షం తెదేపా, జనసేన పోటీ నుంచి తప్పుకోవడంతో మొదట ఈ ఎన్నిక ఏకపక్షమే అనుకున్నారు. లక్షకుపైగా ఓట్ల ఆధిక్యం సాధిస్తామని వైకాపా కీలక నాయకులు ప్రకటించారు. కానీ ఇప్పుడు వైకాపా, భాజపా, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. బద్వేలులో భాజపా, కాంగ్రెస్‌కు ఎక్కువగా క్యాడర్ లేకపోవడంతో తెదేపా నాయకులు, కార్యకర్తల సహకారం కోరుతున్నారు. వైకాపా కూడా కొన్నిచోట్ల తెదేపా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి అత్యధికంగా 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
బద్వేలులోనే మంత్రి పెద్దిరెడ్డి మకాం
బద్వేలులో గతం కంటే ఎక్కువ ఆధిక్యం సాధించాలని పార్టీ నాయకులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వైకాపా అభ్యర్థి దాసరి సుధ నామినేషన్ వేసినప్పటి నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడే ఉండి పావులు కదుపుతున్నారు. మరో ముగ్గురు మంత్రులు, 10 మందికి పైగా ప్రజాప్రతినిధులు ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు.
భాజపా కీలక నేతల విస్తృత ప్రచారం
బద్వేలులో ఇప్పటివరకూ భాజపాకు డిపాజిట్ కూడా దక్కలేదు. కానీ పనతల సురేష్ నామినేషన్ దాఖలు చేశాక భాజపా అనూహ్యంగా పుంజుకుందని స్థానికులు చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇక్కడే ఉంటూ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సహకారంతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. చివర్లో పార్టీ ముఖ్యనేతలు సత్యకుమార్, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం చేశారు. స్థానిక పోలీసులు వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని భాజపా ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేయడంతో 15 బృందాల కేంద్ర బలగాలు బద్వేలుకు చేరుకున్నాయి.