కడప జిల్లా ప్రొద్దుటూరులోని మహిళలు సంప్రదాయ నృత్యరీతుల వైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే కోలాటం నేర్చకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని రాజరాజేశ్వరి దేవి ఆలయ సమీపంలో శ్రావణ్ అనే యువకుడు కళాశాల నిలయం నిర్వహిస్తున్నారు. ఇందులో విద్యార్థులకు కూచిపూడి శిక్షణ ఇస్తున్నారు. అక్కడికి ప్రతిరోజూ సుమారు 70 మంది విద్యార్థులు వెళ్లి సంప్రదాయ నృత్యమైన కూచిపూడి నేర్చుకుంటున్నారు. దీన్ని గుర్తించిన కొందరు మహిళలు తమకు కోలాటం నేర్పించాలని శిక్షకుడు శ్రావణ్‌ను కోరారు. వారి కోరిక మేరకు రాజరాజేశ్వరి దేవి ఆలయం వెనుక ప్రదేశంలో కోలాటం నేర్పిస్తున్నారు. ఇక్కడికి పదుల సంఖ్యలో మహిళలు ప్రతిరోజూ హాజరై కోలాటంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇది ఎంతో ఉపయోగంగా ఉందని మహిళలు చెబుతున్నారు. ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జానపద కోలాటం.. మహిళల్లో నూతనోత్సాహం - kolatam
గృహిణుల్లో చాలా మంది టీవీలు చూడటానికో, కబుర్లు చెప్పుకోవడానికో ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. విలువైన సమయాన్ని వృథా చేస్తుంటారు. ప్రొద్దుటూరులోని మహిళలు మాత్రం తమకున్న సమయాన్ని నృత్యాలు, కోలాటం వంటివి నేర్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తగ్గి ఉల్లాసంగా ఉంటున్నామని వారు చెబుతున్నారు.
కోలాటం
సుమారు ఏడు నెలల నుంచి శిక్షకుడు శ్రావణ్ వారికి కోలాటం నేర్పిస్తున్నారు. ప్రతిరోజూ శిక్షణకు వచ్చి కోలాటం నేర్చుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతత పెరుగుతుందని అంటున్నారు. మహిళలంతా ఒక చోట చేరి కోలాట నృత్యం చేస్తుంటే అక్కడ సందడి వాతావరణ నెలకొంది. తిరుమల లాంటి పెద్ద దేవస్థానాల్లో కోలాటం చేయడమే తమ లక్ష్యం అని చెబుతున్నారు.
ఇదీ చదవండీ... మాటల్లో పెట్టారు... 10 తులాలు దోచుకుపోయారు