కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొందరు మహిళలు సంప్రదాయ నృత్యరీతుల వైపు అడుగులు వేస్తున్నారు. కోలాటం నేర్చుకుంటున్నారు. దేవుడి ముందు నృత్యాన్ని ప్రదర్శించాలనే లక్ష్యంతో క్రమం తప్పకుండా శిక్షణా కేంద్రంలో తర్ఫీదు పొందుతున్నారు. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని రాజరాజేశ్వరి దేవి ఆలయ సమీపంలో శ్రావణ్ అనే వ్యక్తి నృత్య కళాశాలను నిర్వహిస్తున్నారు. కూచిపూడి, కోలాటాలకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన దగ్గరే.. వీరు శిక్షణ తీసుకుంటున్నారు.
గృహిణుల ఆసక్తి
ఈ శిక్షణ కేంద్రంలో ప్రతి రోజూ సుమారు 70 మంది విద్యార్థులు సంప్రదాయ నృత్యం నేర్చుకుంటున్నారు. కొందరు గృహిణుల ఆసక్తి మేరకు వారికి కోలాటం నేర్పిస్తున్నారు. పదుల సంఖ్యలో మహిళలు ప్రతి రోజూ హాజరై శిక్షణ తీసుకుంటున్నారు. వారంలో నాలుగు రోజుల పాటు శిక్షకుడు శ్రావణ్ వారికి మెళకువలు నేర్పుతున్నారు. మిగిలిన రెండు రోజులు సొంతంగా సాధన చేస్తున్నారు.