ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ - ontimitta schedule
ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. రేపు ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న వేడకకు.. అర్చకులు అంకురార్పణ చేశారు.
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం.. బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో... శ్రీరామనవమిని పురస్కరించుకుని.. రేపటినుంచి నిర్వహించనున్న ఉత్సవాలకు... అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ నెల 22 వరకు జరగనున్న వేడుకలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. గత ఏడాది సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా.. వర్ష బీభత్సంతో వేదిక దెబ్బతిన్న ఘటనల నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 18న నిర్వహించనున్న కల్యాణానికి.. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో షెడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. కల్యాణం రోజు ఎవరు అధికారికంగా దేవతామూర్తులకు పట్టువస్త్రాలు సమర్పించాలన్న విషయంపై తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దృష్టి పెట్టారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నకల సంఘానికి లేఖ రాశారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఈ నెల 13న ధ్వజారోహణ, 14న శ్రీరామనవమి వేడుక, 15న సింహ వాహన సేవ, 16న హనుమత్ సేవ, 17న గరుడసేవ, 18న కల్యాణోత్సవం, 19న రథోత్సవం, 20న అశ్వవాహన సేవ, 21న చక్రస్నానం, 22న పుష్పయాగం జరగనున్నాయి.