కడప రైతుబజార్‌లో కిలో టమాటా రూ.100, క్యాప్సికం 120, క్యారెట్ రూ.80.. తిరుపతి రైతుబజార్‌లో కిలో పచ్చిమిర్చి రూ.95, టమాటా రూ.82, క్యారెట్ 72, దొండకాయ రూ.70, వంకాయ రూ.68, కాకరకాయ రూ.68, బీరకాయ రూ.68, దోసకాయ రూ.60 పలుకుతున్నాయి. బంగాళదుంప కూడా రూ.38 పైమాటే. భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న చిత్తూరు, కడప తదితర జిల్లాలే కాదు రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా వానలకు కూరగాయ పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి.
వర్షాలు ఇంకా కురుస్తుండటంతో పొలాల్లో నీరు నిలిచి ఎర్రబారుతున్నాయి. దిగుబడులు పడిపోతుండటంతో మార్కెట్‌కు సరకు తగ్గింది. ఒక్కో మార్కెట్‌కు 40 నుంచి 50 క్వింటాళ్లు రావాల్సి ఉంటే.. ఏడెనిమిది క్వింటాళ్లే అందుబాటులో ఉంటున్నాయి. డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా వ్యయమూ పెరిగింది. వెరసి రాష్ట్రవ్యాప్తంగా అధిక శాతం కూరగాయల ధరలు కిందటి నెలతో పోల్చితే 100 నుంచి 200% వరకు పెరిగిపోయాయి. నాలుగైదు రోజులుగా రాయలసీమ, నెల్లూరు జిల్లాలను వానలు ముంచెత్తడంతో అక్కడ రేట్లు మరింత భారమయ్యాయి. ఏ కూరగాయ కొనాలన్నా కిలో రూ.40 పైమాటే. టమాటా రూ.80 పైన పెట్టాల్సిందే. రేటు సంగతి సరే.. కూరగాయలు దొరికితేగా? అన్నట్లుంది రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి. మొన్నటి వరకు కిలోల లెక్కన కూరగాయలు కొన్న వినియోగదారులు ఇప్పుడు పావు కిలో, అర కిలోతో సరిపెట్టుకుంటున్నారు.
పూత నిలవదు.. కాపు దక్కదు