ఎండకు ఎండి.. వానకు తడిచి.. మరికొన్ని మాయమై ! - kadapa
ఒకట్రెండు కాదు.. వందల కొద్ది వాహనాలు అక్కడ పనికి రాకుండా పోతున్నాయి. ఎండకు ఎండి... వానకు తడిచి కొన్ని తుప్పు పట్టిపోతే... మరి కొన్ని మాయమైపోతున్నాయి. అవన్నీ సీజ్ చేసిన వాహనాలు. పట్టించుకునేవారు లేక అవన్నీ పాడడవుతున్నాయి.
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ పోలీసుస్టేషన్లో వివిధ కేసులు, రోడ్డు ప్రమాదాల్లో పట్టుబడిన వాహనాలను ఏళ్ల తరబడి ఆరుబయటే పడేస్తున్నారు. కేసులు పరిష్కారం కాక కొన్ని, వేలంలో కొనే పరిస్థితి లేక ఇంకొన్ని నాశనమైపోతున్నాయి. అలా ఆరుబయటే ఉన్న వాహనాల విభాగాలను కొంతమంది మాయం చేస్తున్నారు
జమ్మలమడుగు పోలీసు స్టేషన్లో ఉన్న వాహనాలను తుప్పు పట్టినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వేలం వేస్తామన్న ధ్యాస లేక వాటి విడిభాగాలు మాయం చేస్తున్నారు. ప్రమాదాల బారిన పడినవి, వివిధ కేసుల్లో జప్తు చేసినవి శిథిలావస్థకు చేరాయి. లక్షలు విలువ చేసే స్కార్పియో, లారీలు, ద్విచక్ర వాహనాలు నిరుపయోగంగా మారాయి. పోలీసు శాఖ, రవాణ శాఖ అధికారులు స్పందించి వేలం వేసి రాష్ట్ర ఆదాయానికి సహకరించాలని పలువురు కోరుతున్నారు.