ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బడి రారమ్మంటోంది... సమస్యే స్వాగతమంటోంది! - kadapa

వేసవి ముగిసింది. సెలవుల సమయం గతమైపోయింది. బడి రారమ్మంటోంది! కానీ... సరస్వతీ నిలయం మాత్రం సమస్యలతోనే సహజీవనం చేస్తోంది. బడికెళితే భయానక వాతావరణం కనిపిస్తోంది. చివరికి... మూత్రశాలలు సైతం లేక విద్యార్థినులు సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. బడిగంట మోగిన వేళ... కడప జిల్లాలోని వ్యథలపై "ఈటీవీ భారత్" ప్రత్యేక కథనం.

బడి రారమ్మంటోంది... సమస్యే స్వాగతమంటోంది!

By

Published : Jun 14, 2019, 8:02 AM IST

బడి రారమ్మంటోంది... సమస్యే స్వాగతమంటోంది!

"కార్పొరేట్​కు ధీటుగా ప్రభుత్వ విద్యను తీర్చి దిద్దుతాం..." అనే పాలకుల హామీలు ప్రసంగాలకే పరిమితం అవుతున్నాయి. "సర్కారీ బడుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం..." అనిచెప్పే అధికారుల మాటలు ఆచరణకు నోచుకోవడం లేదు. వేసవి సెలవుల్లో మరమ్మతులు పూర్తి చేసుకుని సరికొత్త హంగులతో బడి కొత్తగా ముస్తాబవుతుందని ఆశించిన విద్యార్థులకు ఎప్పటిలాగే... ఈ ఏడాదీ నిరాశే మిగిలింది.

"శిథిల" బడులు...

కడప జిల్లాలో మొత్తం 2542 ప్రాథమిక, 272 ప్రాథమికోన్నత, 411 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2,11,847 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో ఎక్కువ పాఠశాలల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. ఏ పాఠశాల చూసిన ఏదో ఒక సమస్యతో దర్శనమిస్తోంది. 582 బడులకు ప్రహరీ లేదు. కుక్కలు, పందుల మధ్యే మధ్యాహ్న భోజనం చేయాల్సిన దుస్థితి. 706 పాఠశాలల్లో తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. వర్షం వస్తే ఎప్పుడు కూలుతుందో అర్థంకాక బిక్కుబిక్కుమంటూ చదువుకోవాల్సి వస్తోంది.

తాగునీటికి కటకటే..!

ప్రభుత్వ బడుల్లో తాగునీటి కొరత వేధిస్తోంది. కడప జిల్లాలోని 105 పాఠశాలల్లో చుక్క నీటికోసం అల్లాడాల్సి వస్తోంది. మధ్యాహ్న భోజన వర్కర్లు సైతం నీటి కోసం అవస్థలు పడుతున్నారు. 1894 పాఠశాలల్లో వంట గదుల సమస్య వెంటాడుతోంది. చెట్ల కిందే వంట చేయాల్సిన దయనీయత నెలకొంది.

బడుల్లో... సిగ్గు.. సిగ్గు!

మూత్రశాలల కొరత ప్రధాన సమస్యగా మారింది. విద్యార్థినులకు ఇదో ప్రాణసంకటంగా మారింది. ఎవరికి చెప్పుకోలేక వారిలోవారే కుమిలిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక ఉన్నచోట తలుపులు విరిగిపోయి, గోడలకు కన్నాలు పడి... ఇలా దర్శనమిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే... సర్కారీ బడుల్లో సమస్యలెన్నో..!?

ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్య ఇక కలేనేమో! ఈ నిర్లక్ష్యమిలాగే కొనసాగితే... ప్రమాదంలో ఉన్న ప్రభుత్వ విద్య వెంటిలేటర్​పైకి చేరటం ఖాయం.!?

ఇదీ చదవండీ: 2000 కోట్లు.... ఏడు గోపురాలు... 55 అడుగులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details