కడప జిల్లాలో రబీ కింద శనగ పంట ఎక్కువ సాగు చేస్తారు. ఈ ఏడాది 98 వేల హెక్టార్లలో సాగు చేశారు. నేరుగా కొనుగోలు చేసేంత సిబ్బంది లేక మార్క్‌ఫెడ్ అధికారులు డీసీఎంఎస్, రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, గ్రామాఖ్య సంఘాలకు కొనుగోళ్ల బాధ్యతలను అప్పగించారు. 42 కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుభరోసా కేంద్రాల పరిధిలో తూకం వేయాలని అధికారులు సంకల్పించారు. వచ్చిన ఉత్పత్తిలో 30 శాతం దిగుబడులను కొనుగోలు చేయాలనేది నిబంధన. ఆరంభంలో బహిరంగ మార్కెట్‌లోని ధరకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పెద్ద తేడా లేకపోవడంతో దిగుబడులను కేంద్రాలకు తీసుకురాలేదు. తరువాత ధరల్లో తేడాలు రావడంతో కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చారు. సంచుల కొరత కారణంగా కొద్దిరోజులు తూకం వేయలేదనే విమర్శలు వచ్చాయి. ఆ తరువాత నల్లగింజలు ఉన్నాయని కొనుగోలు చేయలేదు. స్థానిక నేతలు, అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి అనుమతులు రావడానికి కొంత సమయం పట్టింది. ఇదే సమయంలో కొవిడ్ కేసులు పెరగడం కూడా కొనుగోలుపై ప్రభావం చూపింది. శుక్రవారం నాటికి కొనుగోలు గడువు ముగిసింది.
● జిల్లాలో 1.23 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనావేసింది. ఆ లెక్కల ప్రకారం వచ్చే దిగుబడిలో 30 శాతం కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ కొనుగోలు చేసింది 1,408 మంది రైతుల వద్ద నుంచి 1,916 టన్నులు మాత్రమే. మొత్తం దిగుబడిలో నిబంధనల ప్రకారం 30 శాతం ప్రకారం చూస్తే 36,900 టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రభుత్వ ధర ప్రకారం క్వింటా రూ.5,100 చొప్పున లెక్కిస్తే సుమారు రూ.9.77 కోట్లు అవుతుంది. ఇప్పటి వరకు 1,270 టన్నులకు 973 మంది రైతుల ఖాతాల్లో రూ.6.54 కోట్లు జమైనట్లు అధికారులు పేర్కొన్నారు.