సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ నీటి విషయంలో రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నీటి కేటాయింపు విషయంలో ఇలాంటి తీరును చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వారు మన నీటిని తీసుకెళ్తుంటే ముఖ్యమంత్రి, జల వనరులశాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
అసలు జల వనరులశాఖ మంత్రి ఎక్కడున్నారో తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. నీటి విషయంలో అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటం కాదని, బహిరంగంగా వచ్చి పోరాటం చేయాలన్నారు. ఎన్టీ రామారావు స్ఫూర్తితో రాయలసీమకు రావాల్సిన నీటి విషయంలో తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. సీఎం జగన్ ఇప్పటికైనా మేల్కొని నీటి విషయంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించాలని కోరారు. అన్ని పార్టీలను పిలిస్తే.. తెలంగాణకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.