కడప జిల్లా ..
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుడుని కోరానని తెదేపా కడప ఇన్ఛార్జ్ అమీర్‌బాబు అన్నారు. దేవాలయాలపై దాడులను నిరసిస్తూ ప్రార్ధన కార్యక్రమంలో భాగంగా నగరంలోని శివాలయంలో ప్రార్ధనలు నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ దాడులపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దేవాదాయశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఏపీలో జగన్ కులమతాలను రెచ్చగొడుతున్నారని అన్నారు.
కృష్ణా జిల్లా..
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వన్‌టౌన్ విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. పార్టీ నాయకులు వెయ్యి కొబ్బరికాయలు కొట్టి ధర్నా నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు లింగనేని శివరామప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా.. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తెదేపా నాయకులు పాల్గొన్నారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామంలో కోటిలింగాల పుణ్యక్షేత్రంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో 160 హిందూ ధార్మిక క్షేత్రాలు సంస్థలపై దాడులు జరిగాయని మండిపడ్డారు.
అనంతపురం జిల్లా ..
రాష్ట్రంలోని హిందూ దేవాలయాలను పరిరక్షించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తేదేపా శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ఉ మామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కోట వీధిలోని భవానిశంకర్ ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు . ఈ ర్యాలీలో అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు పాల్గొన్నారు.
పెనుకొండ
రాష్ట్రంలో దేవాలయాలపై దాడులను అరికట్టడంతో పాటు ఇప్పటి వరకు దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండలోని శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయంలో బీకే పార్థసారథి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు అధికమయ్యాయని అన్నారు. దేవాలయాలపై దాడులకు పాల్పడడంతో పాటు తెదేపా నాయకుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు
నెల్లూరు జిల్లా...
దేవాలయాలపై దాడులను నిరసిస్తూ నెల్లూరులో తేదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని మూలస్థానేశ్వర స్వామి ఆలయం ఎదుట పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని తెదేపా బ్రాహ్మణ సంఘం నేత భువనేశ్వర ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. బిట్రగుంట వెంకటేశ్వరస్వామి రథాన్ని దగ్దం చేసిన వారిని వదిలేశారని అన్నారు. ఆరు నెలలు గడవక ముందే అంతర్వేది రథాన్ని దగ్థం చేశారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు, ధార్మిక సంస్థల నిరసనలతోనే ప్రభుత్వం అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిందన్నారు. అంతర్వేది, , కొండ బిట్రగుంట రథం దగ్ధంపైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆ విగ్రహాలు ఎక్కడివి?!