TDP LEADERS FIRES ON CM JAGAN : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు తెదేపా ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా అరెస్టు చేసిందని ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెల్లవారుజామున 3 గంటలకు అరెస్టు చేసి.. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జగన్ పాలనలోనే సాధ్యమైందని విమర్శించారు. కడప జైల్లో ఉన్న తెదేపా నేత ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఆ పార్టీ నేతలు శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవితోపాటు మరో పదిమంది నేతలు పరామర్శించారు. ప్రవీణ్ రెడ్డితోపాటు మరో ఆరుగురు తెదేపా నాయకులను తెల్లవారుజామున అరెస్ట్ చేయడంతో వారంతా కడప జైల్లో ఉన్నారు. వారిని పరామర్శించి తెదేపా నాయకులు ధైర్యం చెప్పారు. ప్రవీణ్ రెడ్డి ఇంటిపైన వైకాపా నేతలు రాళ్లదాడి చేస్తే.. వారిని అరెస్టు చేయలేదని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేయడం ఏంటని నాయకులు ప్రశ్నించారు. ఇంతకంటే దుర్మార్గమైన పాలన ఎక్కడన్నా ఉందా అని వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. ప్రవీణ్ ఇంటిపై దాడిచేసి ఆయన్నే అరెస్టు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇంట్లో ఉన్న వ్యక్తిపై హత్యాయత్నం కేసు జగన్ పాలనలోనే సాధ్యం అని విమర్శించారు. రెండు రోజుల్లో నారా లోకేశ్ కడపకు వచ్చి తెదేపా నేతలను పరామర్శిస్తారని తెలిపారు. అనంతరం జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని కడప ఎస్పీకి తెలుగుదేశం నేతల బృందం ఫిర్యాదు చేసింది.