పూజ పవిత్రమైన కార్యం. ఈమాన్ అంటే నమ్మకం.. ఈరెండూ పదాలనూ కలిపి అబ్దుల్ కలాం ఆ చిన్నారికి పూజా ఈమాన్ అని పేరు పెట్టారు. చిట్టితల్లి చల్లగా ఉండమని దీవించారు. కలాం పెట్టిన తన పేరును..కలకలాం గుర్తిండిపోయేలా కృషిచేస్తోందా అమ్మాయి. ఈత కొలనులో పతకాలు ఒడిసి పడుతున్న చిన్నారి..పెద్దయ్యాక కలెక్టర్ అయి తనలాంటి వారికి అండగా ఉంటానని చెబుతోంది.
2009 సెప్టెంబరులో ఒకరోజు..కడప జిల్లా రైల్వేకోడూరు వంతెనపై రైళ్లు దూసుకుపోతున్నాయి. వంతెన కింద ఆభాగ్యురాలు ప్రసవ వేదన పడుతోంది. నొప్పులు భరించలేక అరుస్తోంది. రైళ్ల శబ్దంలో ఎవ్వరికీ వినిపించడంలేదు. ఏ బండీ రానప్పుడు వినే నాథుడే ఎవరూ అక్కడికి రాలేదు. కొన్ని గంటలు అవస్థపడి అమ్మాయిని ప్రసవించింది. తల్లి వేదనకు పసిపాప రోదన తోడైంది. బిడ్డను పట్టించుకునే స్థితిలో లేదా తల్లి. గంటలు గడిచిపోయాయి. ఎవరి ద్వారానో సమాచారం అందుకున్న సామాజిక సేవాసంస్థ ప్రతినిధులు అక్కడికి వచ్చారు. తల్లీబిడ్డలను క్షేమంగా కడప జిల్లా మైలవరంలోని రాజా ఫౌండేషన్ అండ్ షేర్ ఛారిటబుల్ ట్రస్ట్ డాడీ హోమ్‌కు తరలించారు.
ఆమె పేరుతో పాఠశాలలు..
ఆశ్రమానికైతే తీసుకొచ్చారు కానీ, ఆ తల్లి వివరాలేవీ తెలుసుకోలేకపోయారు నిర్వాహకులు. పైగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతో బిడ్డను పట్టించుకునే పరిస్థితిలో లేదు. వారం రోజులయ్యేసరికి బిడ్డను వదిలేసి...ఆశ్రమాన్ని వదిలి వెళ్లిపోయిందామె. ఆశ్రమ నిర్వాహకులు ఎంత వెతికినా దొరకలేదు. పత్రికా ప్రకటన ఇచ్చినా లాభం లేకపోయింది. తల్లితో అనాథశ్రమానికి చేరుకున్న ఆ పసిబిడ్డ .. నిజంగానే అనాథగా మారింది. హోమ్ నిర్వాహకులే ఆ బుజ్జాయికి తల్లితండ్రులయ్యారు. తల్లిని తెచ్చి ఇవ్వలేకపోయినా బాగా పెంచాలని నిర్ణయించుకున్నారు. తమ సంకల్పం నేరవేరేదిశగా అబ్దుల్ కలాం ఆశీస్సులను పొందాలని భావించారు. చిన్నారి కథంతా ఆయనకు ఉత్తరం రాసి..పేరు పెట్టాల్సిందిగా కోరారు. దిల్లీనుంచి పిలుపు వచ్చింది. చిన్నారిని తీసుకుని వెళ్లారు హోమ్ నిర్వాహకులు. చిట్టితల్లిని చేతుల్లోకి తీసుకుని ముద్దు చేశారు కలాం. ప్రేమగా..పూజా ఈమాన్ అని నామకరణం చేశారు. ఈ చిన్నారికి బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షించారు. అంతేకాదు అనాథ చిన్నారుల కోసం పాఠశాల ప్రారంభించాలని హోమ్ నిర్వాహకుడు రాజారెడ్డికి చెప్పారు ఆ మేరకు పూజా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించారు. అక్కడో తొమ్మిదో తరగతి చదువుతోంది పూజా ఈమాన్.