కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఖాజీపేటలోని ఓ చిన్నారి ఐపీఎస్ కావాలనుకున్నాడు. ఎలాగైనా ఎస్పీని కలిసి మాట్లాడాలనుకున్నాడు. తన మనసులోని మాటను తండ్రి రియాజ్ అహ్మద్‌కు తెలిపాడు. ఇదే విషయాన్ని జూన్ 2న ఎస్పీకి తండ్రి రియాజ్ అహ్మద్ తెలపగా.. ఖాజీపేటకు వచ్చినప్పుడు తప్పకుండా కలిసి మాట్లాడతానని హామీ ఇచ్చారు.
చిన్నారి తండ్రికి ఇచ్చిన మాటను అన్బురాజన్ ఈరోజు నిలబెట్టుకున్నారు. ఖాజీపేట పోలీసు స్టేషన్‌ను సందర్శించిన అనంతరం.. చిన్నారి మతీన్ అహ్మద్‌ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఐపీఎస్ కావాలన్న లక్ష్యం మిమ్మల్ని చూసి కలిగిందని ఉద్వేగంతో చెప్పిన చిన్నారిలో ఎస్పీ స్ఫూర్తి నింపారు. బాగా చదువుకుని లక్ష్యం దిశగా ప్రయత్నం చేయాలని.. తన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశీర్వదించారు.