వసతుల కోసం పాఠశాల విద్యార్థుల ధర్నా
వారికి సమస్యలే స్వాగతాలు... పాఠ్య పుస్తకాలు లేకుండానే చదువులు... ఇదంతా కడప జిల్లా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల అవస్థలు. తమ సమస్యలపై స్పందించండి అంటూ పీడీఎస్యూ ఆధ్యర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు.
కడప జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని సౌకర్యాల కంటే సమస్యలే ఎక్కువగా ఉన్నాయని.. అయినా పట్టించుకునే వారే లేకుండాపోయారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సరైన విద్య అందించలేమని పీడీఎస్యూ ముందుకు వచ్చింది. తమ కష్టాలపై స్పందించాలని పాఠశాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ.. పాఠశాలలు తెరచి 20 రోజులు గడుస్తున్నా ఇంకా పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో పంపీణీ చేయలేదన్నారు. మౌలిక సదుపాయాలు కూడా లేవని చెప్పారు. పాఠశాలకు ప్రహారీ గోడలు, మరుగుదొడ్లు లేవని అన్నారు. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరని చెప్పారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించి 'కలెక్టర్ బయటకు రావాలి' అని నినదించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఏఓకి వినతి పత్రం అందజేసి.. సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరారు.