పాఠశాల భవనాల నిర్మాణానికి కేటాయించిన స్థలం
కడపజిల్లాలో ఏకశిలానగరి ప్రభుత్వ ప్రాథమిక (మెయిన్) పాఠశాల నూతన భవనాల నిర్మాణానికి మోక్షం లభించింది. ఈ వారంలో భూమి పూజ చేయాలని సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు నిర్ణయించారు. కోదండరాముడి కోవెలను 2015 సెప్టెంబరు 9న తితిదేలోకి విలీనం చేశారు. రామయ్య క్షేత్రంలో రూ.105 లక్షలతో పుష్కరిణి నిర్మించారు. మరో రూ.1.40 కోట్లు వెచ్చించి రెండు వరుసల తారు రహదారి వేశారు. మాడ వీధులను అనుసంధానం చేయాలంటే ప్రాథమిక పాఠశాల భవనాలు అడ్డుగా ఉన్నాయి. వీటిని తొలగించాలని తితిదే ప్రతిపాదించగా అప్పటి కలెక్టరు టి.బాబూరావునాయుడు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో 1924 మే 30వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఈ బడిలో నాలుగు తరగతి గదులు, వంట గది, మూడు మూత్రశాలలు, మరో మూడు మరుగుదొడ్లను 2018, ఫిబ్రవరి 16వ తేదీన కూల్చే శారు. ఆ తర్వాత 17న కలెక్టరు ఇక్కడికి వచ్చి పరిశీలించారు. సుమారు రూ.50 లక్షలతో త్వరలో కొత్త భవన సముదాయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.
రెండున్నరేళ్లు దాటినా ఎలాంటి కదలిక లేదు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న 16 సెంట్ల స్థలాన్ని ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ జిల్లా పరిషత్తు సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అంచనాలు, ప్రతిపాదనలు, గుత్తపత్రాల నిర్వహణ, పనుల పర్యవేక్షణ బాధ్యతలను ఎస్‌ఎస్‌ఏకి అప్పగించారు. ఈ పనులన్నీ పూర్తి చేయాలంటే రూ.80 లక్షలు ఇవ్వాలని 2019 ఏప్రిల్ 22వ తేదీన ప్రతిపాదనలు పంపించారు. అదే ఏడాది అక్టోబరు 23వ తేదీన తితిదే పాలకమండలిలో ఆమోదముద్ర వేశారు. ఈ ఏడాది మార్చి 10వ తేదీన తొలివిడతలో రూ.40 లక్షలను సమగ్ర శిక్షా అభియాన్‌కు బదలాయించారు. ఇటీవల రూ.63.41 లక్షల విలువ చేసే పనులకు గుత్తపత్రాలను ఆహ్వానించారు. ఓ గుత్తేదారు 4.1 శాతానికి తక్కువగా నమోదు చేసి పనులను దక్కించుకున్నారు. గుత్తేదారుతో రూ.60.81 లక్షలతో ఒప్పందం జరిగింది. ఆరు గదులను నిర్మించేందుకు రూ.49.53 లక్షలు, వంట గదికి రూ.2.62 లక్షలు, తాగునీటి వసతికి రూ.2.05 లక్షలు, విద్యుత్తు సరఫరాకు రూ.1.78 లక్షలు, మరుగుదొడ్లు, మూత్రశాలలకు రూ.7.60 లక్షలు కేటాయించారు. తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని గడువిచ్చారు. ఈ వారంలో పనులు చేసేందుకు భూమి పూజ చేయనున్నట్లు ఎస్‌ఎస్‌ఏ పీవో అంబవరం ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. నాణ్యతా ప్రమాణాలతో సర్వాంగ సుందరంగా నిర్మిస్తామని చెప్పారు.
ఇదీ చూడండి.విశాఖలో మెట్రో కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభం