కడప జిల్లాలోని కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రితో పాటు పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, బద్వేలు, జమ్మలమడుగు, కమలాపురం తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరం శిబిరాలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఆ ఆసుపత్రుల్లో కొవిడ్ వైరస్ ప్రభావంతో ఈ ఏడాది మార్చి నుంచి వైకల్య ధ్రువీకరణ ప్రక్రియను నిలిపివేశారు. నవంబరు 3 నుంచి వాటిలో నిర్ణయించిన తేదీల్లో మానసిక, శారీరక వైకల్య, కంటిచూపు, చెవి, గొంతు తదితర లోపాల నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు చేయించుకునేందుకు నవంబరు 1 నుంచే స్లాటు బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ధ్రువీకరణ పత్రాలు అవసరమైన వారు దగ్గరలోని మీసేవ కేంద్రాలు, గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని వైద్యులు చప్పొరు.
15 వేల మందికి ప్రయోజనం...
జిల్లాలో ఇప్పటికే 60 వేలమంది దివ్యాంగులు ప్రభుత్వం అందించే పింఛను పొందుతున్నారు. ఇంకా 15 వేల మంది వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు మీసేవ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
అదేరోజు ధ్రువపత్రాలు...
దివ్యాంగులకు విభాగాల వారీగా వైద్యులతో పరీక్ష చేయించి అదేరోజు ధ్రువపత్రాలు జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షల సందర్భంగా కొవిడ్ నిబంధనలు పాటించేలా ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.