Robbery in Tirupati Guntur Express: దొంగలు కూడా తెలివిమీరుతున్నారు. ఎక్కువ శాతం రైల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. అయితే రైల్వే స్టేషన్లో దొంగతనాలకు పాల్పడితే పట్టుకుంటారని.. తెలివిగా ప్రవర్తించి ప్రయాణికులతో పాటుగా కొంతదూరం వెళ్లి వారికి అనువైన ప్రదేశం రాగానే అనుకున్న పని మొదలుపెడతారు. అందిన కాడికి దోచుకుని పనైపోగానే పారిపోతారు. తాజాగా ఇలాంటి ఘటనే కడప జిల్లాలో జరిగింది.
తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తిరుపతి నుంచి గుంటూరు వెళుతుండగా.. అర్ధరాత్రి ఒక్కసారిగా బోగీల్లో ఉన్న దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికులను బెదిరించి అందినకాడికి లాగేసుకున్నారు. శుక్రవారం రాత్రి తిరుపతిలో రైలు 7గంటల 30 నిమిషాలకు బయల్దేరాల్సి ఉంది. కానీ ఓ గంట లేట్‌గా స్టార్ట్ అయ్యింది. అప్పటికే అందులోకి ఎక్కిన దొంగలు కడప జిల్లా కమలాపురం రైలు నిలయం దాటిన తర్వాత ఓ సిమెంటు ఫ్యాక్టరీ సమీపంలో రాత్రి 11గంటల 30నిమిషాల ప్రాంతంలో రైలును ఆపారు. వెంటనే లోపల ఉన్న 20 నుంచి 25 మంది వరకు దుండగులు ఒక్కసారిగా ఎస్1 నుంచి ఎస్6 వరకు ఉన్న బోగీల్లో కిటీకీల పక్కన ఉన్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దోపిడి స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల బంగారు ఆభరణాలను అందిన కాడికి లాక్కుని పారిపోయారు. రైల్లో కొందరు ప్రయాణికులు ప్రతిఘటించే యత్నం చేయగా వారిపై దాడులు చేశారు. ఎస్3 బోగీలో నలుగురు మహిళల బంగారు ఆభరణాలు లాక్కెళ్లేందుకు దుండగులు ప్రయత్నించగా.. ముగ్గురు ప్రతిఘటించిగా.. ఒకరి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు.