JAGANANNA MAHILA MART: ఇది సూపర్ మార్ట్.. అంతేనా ఆదర్శానిచ్చే మహిళా మార్ట్ కూడా..! - ఇది సూపర్ మార్ట్!
వాళ్ల వ్యాపార నిర్వహణ కార్పొరేట్ సంస్థలనే అబ్బురపరిచింది. ప్రభుత్వాన్నీ కదిలించింది. ఎనిమిది వేల మంది మహిళలు ఒక్కతాటిపైకొచ్చి, పొదుపు సొమ్ముతో ఏర్పాటు చేసిన ఈ మహిళా మార్ట్ సాధించిన విజయం స్ఫూర్తిదాయకం. నెలకి పదిహేడు లక్షల రూపాయలకు పైగా వ్యాపారం చేస్తున్న కడప జిల్లా పులివెందుల మహిళల విజయగాథ ఇది...!
ఇది సూపర్ మార్ట్.. అంతేనా ఆదర్శానిచ్చే మహిళా మార్ట్ కూడా..!
By
Published : Oct 26, 2021, 8:40 AM IST
రుణాలు తెచ్చుకోవడం.. తలా కొంత పంచుకోవడం తాత్కాలిక అవసరాలను తీర్చుకోవడం... దీనివల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని వాళ్లు గ్రహించారు. మరో అడుగు ముందుకు వేయాలని చేయీ చేయీ కలిపి కిరాణా వ్యాపారం ప్రారంభించారు. పులివెందుల పట్టణంలోని 1270 సంఘాల్లో 10,200మంది సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరు రూ.150 పొదుపు చేసి ఆ మొత్తంతో వ్యాపారం ప్రారంభిస్తే ఆర్థికంగా రాణించొచ్చన్న అధికారుల మాటలు వారిని ఆలోచింపజేశాయి. వెంటనే సభ్యులంతా రూ.150 చొప్పున పొదుపు చేశారు. అందులో నుంచి రూ.10 లక్షలు తీసుకుని, పెట్టుబడిగా పెట్టి పులివెందులలో ‘జగనన్న మహిళా మార్ట్’ పేరుతో సూపర్‌మార్కెట్‌ని ప్రారంభించారు.
జనవరిలో దీన్ని ప్రారంభించినప్పుడు వాళ్లు పెట్టుకున్న నెలవారీ వ్యాపార లక్ష్యం రూ.15 లక్షలు. కొద్ది కాలంలోనే దాన్ని సాధించేశారు. అంచెలంచెలుగా పెంచుకుంటూ ఈ సెప్టెంబరు నాటికి రూ.17 లక్షల వ్యాపారం చేశారు. కొవిడ్ లేకుండా ఉంటే రెట్టింపు వ్యాపారం చేసే వాళ్లమని చెబుతున్నారీ మహిళలు. మొదట్లో ‘ఈ పోటీ ప్రపంచంలో మన వ్యాపారం రాణిస్తుందా?’ అనే అనుమానం కొంతమంది సభ్యులకొచ్చినా... ‘బయటి వారే ఎందుకు? పెట్టుబడి పెట్టిన మన సంఘ సభ్యులే 8 వేల మంది ఉన్నారు. వీరంతా మన సూపర్ మార్కెట్లో కొనుక్కున్నా చాలు. ప్రతి సభ్యురాలూ నెలనెలా కనీసం వెయ్యి రూపాయల సరకులు కొన్నా... రూ.80 లక్షల వ్యాపారం చేయొచ్చు అనుకున్నాం. సభ్యులు ఇక్కడే కొనుగోలు చేసేలా అవగాహన కల్పిస్తున్నాం’ అంటున్నారు పులివెందులోని కమ్యూనిటీ కోఆర్డినేటర్ హరిత.
తక్కువ ధరలకే...
ఈ ఏడాది జనవరి 3న ఈ మార్ట్‌ని ప్రారంభించారు. ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్, పర్చేజింగ్, సేల్స్, ప్యాకింగ్, ఇంటింటికి సరకుల సరఫరా... ఇలా అన్ని ఉద్యోగాల్లోనూ పెట్టుబడి పెట్టిన వారిలో తగిన అర్హతలు ఉన్న వారినే నియమించుకున్నారు. వాళ్లకి జీతం ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నారు. ఇతర దుకాణాల కంటే తక్కువ ధరకే నాణ్యమైన సరకులు అందిస్తుండడంతో స్థానికులూ ఈ మార్ట్‌కే వస్తున్నారు. మహిళా సంఘాల సభ్యుల నిర్వహణ తీరుని చూసి రిలయన్స్ సంస్థ వీరితో చేతులు కలిపేందుకు ముందుకు వచ్చింది. ఇక నుంచి రిలయన్స్ వస్త్రాలనూ మార్ట్‌లో విక్రయించనున్నామని, దీని ద్వారా మరికొంత మొత్తాన్ని సంపాదిస్తామని వివరించారు మార్ట్ ప్రతినిధులు. దీని మీది లాభాలను ప్రస్తుతానికి వ్యాపారంలోనే పెడుతున్నారు. ‘మార్ట్ మాదే అనుకుని పని చేస్తున్నాం. వ్యాపారంలో భాగస్వాములమై, ఇక్కడే పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అంటోంది సేల్స్ విభాగంలో ఉన్న పుష్పలత. ‘బయట కొనుగోలు చేసిన సరకులకు ఎక్కువ ధర చెల్లించాల్సి వచ్చేది. మార్ట్‌లో అవే వస్తువులు తక్కువ ధరకే లభించడంతో కొంత సొమ్మూ ఆదా అవుతోంది’ అంటున్నారు సంఘం సభ్యురాలు పార్వతి. వీరి విజయాన్ని ముఖ్యమంత్రి ట్విట్టర్ వేదికగా ప్రశంసించడంతో మరింత మంది మహిళలు ముందుకొస్తున్నారు. వీరి స్ఫూర్తితో రాయచోటి పట్టణంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మరో మార్ట్ ప్రారంభం కానుంది. మిగిలిన జిల్లాల నుంచి కూడా మహిళా సంఘాల బాధ్యులు వచ్చి వివరాలు తెలుసుకుని వెళ్తుండటం మరింత ప్రోత్సాహకరంగా ఉందని ఈ మహిళలు సంతోషంగా చెబుతున్నారు.