PCC media chairman Tulasi Reddy fire on CM Jagan: అత్త సొత్తు అల్లుడుకి దానం చేసినట్లు ఉంది ముఖ్యమంత్రి జగన్ వైఖరి అని పీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి విమర్శించారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు దిక్కులేదు కానీ.. ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. రోజుకో సలహాదారుడి నియామకం.. ఒక్కొక్క సలహాదారునికి నెలకు సుమారు 5లక్షల రూపాయల ఖర్చు.. సొంత పత్రిక సాక్షి, టీవీలో ప్రకటనల కోసం ఏడాదికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారు. మరోవైపు సంవత్సరానికి నూరు కోట్ల రూపాయలతో గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి సాక్షి పత్రిక పంపిణీ చేయడం.. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు.
విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో పెట్రోలియం యూనివర్సిటీని స్థాపించాలి. కానీ ఎనిమిదిన్నర సంవత్సరాలైనా.. అతీగతి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.1055 కోట్లు కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వని కారణంగా పనులు ప్రారంభం కాలేదు.. వర్సిటీ వేరే రాష్ట్రానికి తరలిపోయే ప్రమాదం ఉందని.. ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు మచ్చుతునక అని గుర్తు చేశారు.